నవ్వు తెప్పిచ్చేవి- నవ్వు అప్పిచ్చేవి - నవ్వు తప్పించేవి
####################
మానవ ప్రవృత్తి వింతగా ఉంటుంది. మీరు ఏమీ మాట్లాడకుండా వేరే వాళ్ళు మాట్లాడేది వింటూ కూర్చున్నారనుకోండి చాలా వింతలూ విశేషాలూ, నవ్వు తెప్పిచ్చేవి, నవ్వు అప్పిచ్చేవి,(వేరే వాళ్ళకు చెప్పినప్పుడు వాళ్ళు నవ్వుతారు కదండీ అది అప్పు. ఇప్పుడు మీరు నాకు నవ్వు బాకీ) నవ్వు తప్పించేవి (నవ్వు తప్పించి అంటే ఏడుపు తెప్పిచ్చేవి చాలా విశేషాలు బయట పడతాయి). ఇక్కొడో విషయం గ్రహించాలండీ! మనలాంటి తెలివిగల వాళ్ళే మనం మాట్లాడేది విని నవ్వుకొని, బ్లాగులు వ్రాసి నవ్వించీ లాంటి పనులకు ఉపయోగిస్తూ ఉండొచ్చు. అందుకని, గురజాడ ఆప్పారావు గారు చెప్పినట్టు, "మౌనం భోషాణం పెట్టె" అని నోరు మూసుకుని, చెవులు తెరుచుకుని కూర్చోవాలి. ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడిగుండంత సుఖం లేదు. అందుకే మన్మోహనుడు మాట్లాడే వాడు కాదు. అయితే ఆయన నోరే కాదు, చెవులు కూడా (టర్బన్ కింద) మూసుకునే వాడు. కళ్ళు తెరుచుకుండేవాడు అనడానికి దాఖలాలు లేవు. కళ్ళున్న వాడెవడూ కని పెట్ట లేక పోయాడు!
ఈ వింతలు, విశేషాలూ ప్రధానంగా క్షౌరశాలల్లోనూ, రైలు పెట్టెల్లోను ఎక్కువగా తారసపడుతూ ఉంటాయి. పెళ్ళిళ్ళలోనూ, పేరంటాల్లోనూ కూడా తారస పడడం కద్దు. అయితే పేరంటాల్లోకి మగ వాళ్ళను రానీయరు కదా? అది ఆడ వాళ్ళ సొంతం. ఏమో తృప్తి దేశాయ్ భర్త (ఆమెకు పెళ్ళయ్యుంటే) పేరంటాల్లో మగ వాళ్ళకి ప్రవేశం మీద హంగామా చెయ్యొచ్చేమో, ఊరుకున్న శంఖాన్ని ఊది చెడగొట్టినట్టు.
అన్నిటి కంటే మనకు తారస పడే ప్రవృత్తి "మనకున్న ప్రత్యేకతలు" అవతలి వాడికి తెలియ చెప్పాలనే తపన. ఇది సొంత డబ్బా అనడానికి లేదు, కాదనడానికీ లేదు.
సొంత డబ్బా (దీనినే ఆంగ్లమందు BRAGGING అందురు)
ఘంటసాల గారు "దేవదాసు" సినిమాలో "జగమే మాయ" పాట పాడేరు కదండీ. ఆ పాటయ్యాక చివర్లో దగ్గుంటుంది. చాలా మంది అది నాగేశ్వర రావు గారు దగ్గుండచ్చు అనుకునే వాళ్ళు. ఘంటసాల గారు ఎక్కడన్నా ప్రైవేటు ఫంక్షనులో పాడేప్పుడు అంతా అయ్యాక "ఈ దగ్గు నేనే దగ్గానండీ సినిమాలో" అని చెప్పే వాళ్ళుట. అంతే కదండీ కొన్ని విషయాలు చెబితే కానీ తెలియవు. (కేజ్రీవాలుకి ఆ అవసరం లేదు. అషుతోషు దగ్గుతాడని ఎవరూ భ్రమ పడరు కదా?)
మా సుపుత్రుడు కూడా నన్నెప్పుడూ ఎద్దేవా చేస్తుంటాడు. "మా డాడీకి నేను సీ ఏ, సీ ఎస్, బీ కాం 23వ పుట్టిన రోజుకే పూర్తి చేశానని చెప్పుకోక పోతే తోచదు. ఏదో విధంగా ఆ విషయాన్ని తీసుకు వస్తారు" అని. చూశారండీ ఇక్కడ కూడా ఆ టాపిక్ తెచ్చి మీ దగ్గర కూడా డబ్బా కొట్టాను. అదన్న మాట పద్ధతి.
ఒక దశాబ్దం క్రితం వరకు "నేను అమెరికా వెళ్ళినప్పుడు" అని చెప్పుకోవడం గొప్ప. ఇప్పుడు ఆ మాట చెబితే "అయ్యో1 పాపం! అలాగా! ఎప్పుడు జరిగిందీ" అని ముక్కు మీద వేలేసుకుంటున్నారు. మా చుట్టం ఒకావిడ "ఏముంది చంద్రా (నా పేరు)! అంట్లు తోమడానికి ఇక్కడైతేఏమిటీ? అమెరికా ఐతే ఏమిటీ? " అని వాపోయింది. అమెరికా వెళ్ళటమంటే ఆముదాలవలస వెళ్ళినట్టే అన్నంత సుళువైపోయింది. అంచేత ఈ మధ్య చాలా మంది, "ఇప్పుడే ఊరెళ్ళి వస్తాము. కాస్త మా ఇల్లు కనిపెట్టుకుని ఉండండి " అని చెప్పుకుంటున్నారట.
"ఎన్నాళ్ళో వేచిన ఉదయం" అన్నట్లు కొంత మందికి తన గొప్ప తనం చెప్పుకోడానికి "హృదయం ఎగిసి పడుతూ ఉంటుంది" మిగతా నగరాల సంగతి తెలియదు కానీ మా భాగ్యనగరంలో మాత్రం ఏ విషయం మాట్లాడదామన్నా అవకాశం ఉండదు. భూమి గుండ్రంగా ఉన్నట్లు అన్ని విషయాలూ చివరికి భూములూ, భూముల మీద కట్టిన ఇళ్ళూ వాటి విలువలూ మీదకే సంభాషణ మళ్ళుతుంది. ముఖ్యంగా రిటైరయ్యి కొడుకో, కూతురో అమెరికా లోనో, ఆస్ట్రేలియా లోనో ఉంటే ఇక చూడండి. ఈ మహానుభావుడు ఎప్పుడు గుటుక్కుమంటాడో తెలియదు.
"మా వాడు ఫలానా చోట గజం 3 వేలకు కొన్న భూమి ఇప్పుడు 12000 అయింది, లాంటి వాక్యాలు టీవీ సీరియల్లో ఆడ వాళ్ళ ఏడుపుల లాగా వినపడుతూనే ఉంటాయి. కంది పప్పు యాభై రూపాయల నుండి 200 రూపాయలైందనే విషయం వీరు చర్చించరు. ఎందుకంటే, వారికి ఆ అవసరం లేదు కనక.
డాంబికం లేదా పటాటోపం (దీనినే ఆంగ్లమందు VANITY అందురు)
ఆంగ్లంలో VANITY FAIR అనే నవల ఉంది. ఇదంతా అప్పటి ఆంగ్ల యువతులు ప్రదర్శించే వారి, వారి ఉన్న మరియు లేని గొప్పలు గురించిన కధ. చాలా బాగుంటుంది, చదవండి.
ఓ సారి మా దంపతులం (గొప్ప చెప్పుకోవడం కాదు కాని మేమిద్దరం ఎప్పుడూ కలిసే వెళతాము. కిరాణా కొట్టుకు కూడా. అది మా ప్రత్యేకత) రైల్లో ఎక్కాము. ఎదురుగా ఇంచు, మించు మా వయసు వాళ్ళే దంపతులు కూర్చున్నారు. కూర్చోగానే ఆమె, " డ్రైవరుని పంపించారా" అంది. ఆయన నా లాగానే కొంచం చిరాకు మనిషి, డాంబికం నచ్చని మనిషి (ఇది నా డాంబికం కాదు సుమా, నిజమే) అనుకుంటా. "లేదు1 మనమొచ్చే దాకా ఆరు నెలలు స్టేషను బయటే కూర్చోమన్నా" అని చురకేశాడు. . ఆయనికీ, మాకూ అర్ధ మయ్యిందేమిటంటే వాళ్ళకు కారున్న విషయమూ, దానికి డ్రైవర్ పెట్టుకుండే స్తోమత ఉన్న విషయమూ చెప్పాలని ఆమె తపన. దాని మీద ఆయన ఒక గ్యాలను పెట్రోలు పోసి నిప్పంటించాడు.
మా చిన్నతనంలో, అంటే కాలేజీలో చదివే రోజుల్లో, చేతి గడియారమే పెద్ద ఫ్యాషను. అందులోనూ తరువాత వచ్చిన టైటాన్ చేతి గడియారముంటే ఇక చూడు "దాని సోకు మాడ" . ఆ రోజుల్లో సాయంకాలం పూట మా వీధి అరుగుల మీద కూర్చునే వాళ్ళం, పిల్ల గాలి తగలక పోతుందా అని. తెనాల్లో అరుగులు చాలా ప్రాముఖ్యంగా ఉండేవి, ప్రతీ ఇంటికీ (మురుగు కాలవలు కూడ అంతే ప్రాముఖ్యంగా ఉండేవి, కానీ వయసు అలాంటిది పంది పిల్ల కూడా అందంగా కనిపించే వయసు. అంచేత మురుగు వాసన పిల్ల గాలిలో కొట్టుకు పోయేది.) అలా మేము కూర్చున్న ప్రతి రోజూ ఒక అమ్మాయి ఆ రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉండేది. (మేము కూర్చోని రోజు కూడా వెళ్ళేదెమో నాకు తెలియదు).
ఆ అమ్మాయి చేతికి కొత్తగా కొన్న చేతి గడియారముండేది (బ్రాండు పేరు తెలీదు). ఆ అమ్మాయి ప్రతి నిమిషానికీ సమయం చూసుకుంటుండేది. అది ఆ రోజుల్లో మామూలే. నాకు ఇరవై ఏళ్ళు వచ్చేప్పటికి గడియారం ఫ్యాషను అలానే ఉండేది. నేను నా స్నేహితురాలికి (ఇప్పటి రోజుల్లో భార్య) టైటాన్ చేతి గడియారం కొనిచ్చి ఆమె చెయ్యి గెలుచుకున్నా కదా? తరువాత ట్రాన్సిస్టర్ ప్రతి యువకుడి చెవిలో ఒకటుందేది. ఈ మధ్య రోజుల్లో ఫ్యాషన్లు చాలా త్వరగా మారుతున్నాయి. ఐ ఫొడ్లు, ఎం 3 ప్లేయర్లు, డిజిటల్ కెమేరాలు, సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు అబ్బో కంపెనీలు వొత్తిడి మీదున్నాయి. కొత్త, కొత్త విషయాలు కనిపెట్ట లేక. ముళ్ళపూడి రమణ గారు ఒక జోకు రాశారు.
"ప్యారిస్ నగరంలో ఫ్యాషన్ ఎంత వేగంగా మారుతుందంటే, ఓ ముద్దు గుమ్మ మేక్ అప్ అయి బయటి కొచ్చేప్పటికి ఫ్యాషన్ మారి పొతూ ఉండేదిట. ఇక లాభం లేదనుకొని, ప్రతీ సారీ మేక్ అప్ కాగనే ఓ రెండు అంగుళాలు స్కర్ట్ కత్తిరించుకొని బయటికొచ్చేదిట. ప్రస్తుతమున్న "చిన్న బట్టల" కధకి వెనుక భూమి (బాక్ గ్రౌండ్) ఇదేనని వాకృచ్చారు.
మీరు గమనించారో లేదో ప్రతి కాలేజీ అమ్మాయి చేతుల్లో ఒక స్మార్ట్ ఫోను లాంటిది ఉంటుంది. ఏమిటో నొక్కు తూనే ఉంటారు, ముందు గుట్ట ఉందా, గుంట ఉందా తీలీదు. నా దగ్గరా ఉంది కానీ ఓ ఫోను. రోడ్డు మీద వెళ్తున్నపుడు ఏం నొక్కాలో తెలీదు. అందుకే ఏ గాయం కాకుండా ఉన్నానేమో ఇంతవరకు. (నేను నడతలో ఎంత నిర్లక్ష్యంగా ఉంటానో నడకలో అంత జాగ్రత్తగా ఉంటానండి. నేనెక్కడ "కాలు జారుతానో"నని నా భార్య ఎప్పుడూ వెనకే ఉంటుంది, ముందు వచ్చే వాళ్ళను గమనిస్తూ.అందుకే మేమిద్దరం కలిసే వెళుతూ ఉంటాము.)
ఇలా డాంబికాల గురించి చెప్పాలంటే చాలా ఉంటాయి. ఓరుగల్లు నుంచి సికిందరాబాదుకి కాకతీయ ఫాస్ట్ ప్యాసెంజరు అని ఉండేది. ఇది పొద్దున్నే బయలుదేరి (5 గంటలకి) ఆఫీసు టైముకి సిక్'బాదు చేరేది. ఇందులో ఒక సుఖముంది. ఆఫీసు టైముకి చేరుకుని అక్కడ ఎంచక్కా నిద్ర పోవచ్చు. అంచేత ఆఫీసు గోయర్స్ అంతా దీన్లోనే వెళ్ళే వాళ్ళు. అయితే దీన్లో ఓ తిరకాసు ఉండేది. చెన్నయి నుండి సికిందరాబాదు దాకా ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా ఈ బండి రద్దు అయ్యేది.
ఓ సారి ఈ బండి రద్దయ్యింది. అందరూ ఆదుర్దాగా స్టేషను మాస్టర్ని నిల దీశారు, "మేము ఆఫీసులకి వెళ్ళి నిద్ర పోవలా వద్దా" అన్నట్టుగా. "మళ్ళీ ఇంటికి వెళ్ళి నిద్ర పోతే కరెంటు దండగ" అనీనూ. ఇంతలో ఓ కుర్రాడు, (అప్పుడు నేనూ కుర్రాడినే) మెడికల్ రెప్రెజెంటేటివ్లా ఉన్నవాడు "నేనసలే ఫస్టు క్లాస్ టికట్ కొన్నాను. బండి నడపాల్సిందే" అన్నాడు. అంతే అందరూ గొల్లున నవ్వారు. "ఏందయ్య! నువ్వు గిన ఫస్టు క్లాస్ కొన్నవని బండి నడపాల్లే?. అయినా కంపెనీ ఇస్తే నేను ఇమానంలోనే ఎల్తా" అని జోకులు. నేను నా ఫస్ట్ క్లాస్ టికట్టు జేబులోకి తోసేశా! నాదీ కంపెనీ సొమ్మే కదండీ. ఇలా ఉంటాయి డాంబికాలు. దీన్నే "అంచు డాబే కానీ పంచె డాబు లేదు" అంటారు.
ఇక వయసు డాంబికాలు బహు గొప్పగా ఉంటాయి. ఆడవాళ్ళు ఈ విషయంలో కొంచెం ముందుంటారు. "మీ వయస్సెంతండీ? అని అడిగితే 50+ అని చెప్పడం కద్దు. ఈ ప్లుస్ లో తొమ్మిది సంవత్సరాల, పదకొండు నెలల, మూడు వందల అరవై నాలుగు/అరవై ఐదు రోజులుండొచ్చు. రేపు అరవై నిండే వారు కూడా ఈ రోజు 50+ కదా?
ఈ విషయంలో ముళ్ళపూడి వారు ఓ జోకు వ్రాశారు. ఇద్దరు 90+ వయస్సు పెద్ద మనుషులు రైల్లో వెళ్తూ ఉన్నారట. ఓ 90+ "ఏమండీ మీ వయస్సెంతుంటుందంటారు?" అని అడిగాడట. "ఆ! ఎంతండీ 60+ అని చెప్పి "మీ వయస్సెంత?" అని బదులు ప్రశ్న వేశాడట. "ఎంతండీ? 55+" అని చెప్పాట్ట. ఇంతలో పైన బెర్తులో ఉన్న ఒక 30+ యువకుడు జారి కింద పడ్డాడుట. గాభరా పడుతున్న ముసలోళ్ళని చూసి,' గాభరా పడకండి. నేనిప్పుడే పుట్టాను" అని చెప్పాడుట. అదండీ మనం వయసు దాచి పెట్టినా దాగదు కదా?
బడాయిలు దీన్నే "cock-a-doodle-doo" అని అంటారు.
మేము కాలేజీలో చదివే రోజుల్లో అమ్మాయిలు గ్రంధాలయంలో పెద్ద, పెద్ద పుస్తకాలు తీసుకుని చంకలో పెట్టుకుని పోతూ ఉండేవారు. వీళ్ళు రాగానే గ్రంధాలయ నిర్వాహకుడు (librarian) వీళ్ళు వచ్చే సమయానికి పుస్తకాలు తూకం వేసి ఎక్కువ బరువున్న పుస్తకాలు తీసి పెడుతూ ఉండే వారు. అదో బడాయి. మళ్ళీ అట్ట కూడా నలగకుండా తీసుకొచ్చే వాళ్ళుట. (నా భార్య మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్ అయింది. "నేను చదివే దాన్ని అని" అని ఖండితంగా చెప్పింది.ఇదో బడాయి. నాకు తెలీదా?)
అందుకే సినీ కవి "హలో, హలో ఓ అమ్మయీ! పాత రోజులు మారాయి! ఆపు ఇక నీ బడాయీ!" అని వ్రాశాడు.
"భలే కోడళ్ళు" అని ఒక పాత సినిమాలో, కోడళ్ళు బడాయికి పోయి ఆస్తంతా కరగేస్తారు. ఎస్వీ రంగారావు మామ. మనవ సంతానం సహాయంతో వాళ్ళ కళ్ళు తెరిపిస్తాడు. "ఆస్తి మూరెడు, ఆశ బారెడూ చివరికి అప్పులూ చేతికి చిప్పలూ" అని ఒక పాట ద్వారా దర్శకుడు "బడాయి" లకు పోతే వచ్చే నష్టాన్ని తెలియ చేస్తాడు.
నేనోసారి ఓ క్షౌర శాలలో "నా జుట్టు కత్తిరించుకొను" సమయము కొరకు వేచి చూస్తూ కూర్చున్నా. ఇంతలో ఒక వ్యక్తి వచ్చాడు. ఇతను ఆ శాలలో అందరికీ పరిచయమైన వ్యక్తే అనుకుంటా. బడాయీలు చెప్పే వాళ్ళు కొంతసేపు అవిశ్రాంతంగా తిరుగుతూనో, కూర్చుని అదే పనిగ గోళ్ళు గిల్లుకుంటూనో ఉంటారు. గమనించారా? దీనికో కారణ ముంది. వీళ్ళు తము చెప్పబోయే విషయం అక్కడున్న వాళ్ళందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచుతుందని గట్టిగా నమ్ముతారు. ఆ ఆలోచనే వారిని అవిశ్రాంతంగా చేస్తుంది. ఇతను కూడా అలానే కొంత సేపు గింగిరాలు తిరిగి తన బడాయి మొదలు పెట్టాడు. వారి సంభాషణ వారి మాండలికంలోనే ఇలా సాగింది.
ట.
ఎద్దు ఈనిందని ఒకడంటే, దూడను గాట కట్టెయ్యమని మరోడన్నాడం
బడాయి వ్యక్తి (బ.వ్య): సునో! కల్ మై ఎక్ ఆపరషన్ దేఖా! కిత్నా పరెషాన్ హువా భై! కళ్ళు తిరిగినై అనుకో. అరె! యే డాక్టరాం కైసే కర్తే భై! ఆ డాక్టరు నా దోస్తేలే! అందర్ ఆనే దియా! నహిన్ తో, మనకి చూణ్ణికి కుదరది!
క్షౌర శాల ఉద్యోగి: ఏం ఆపరేషనన్నా? గంత సీరియస్సు? (ఒక చిరు నవ్వు విసిరాడు. అంటే అతనికి ముందే తెలుసన్న మాట)
లోపల సెలూన్ యజమాని ఎవరికో మసాజ్ చేస్తున్నాడు. అతను గట్టిగా " గట్లెట్ట సూపిస్తారు భై. గదేమన్న ఆపరేషనా, ఇంజక్షనా' అని అరిచాడు.
బ.వ్య.: మా కి కసం అన్నా! నేంచూసినా!
క్షౌ. శా.ఉ.: నువ్వు చెప్పన్నా? ఏమాపరేషను? అన్న అట్లానే అంటాడులే. నువ్వు చెప్పు.
ఇంకో సారి కిసుక్కు.
బ.వ్య.: గదే భై. జుట్టు మారుస్తారు చూడు. "హైర్ ట్రాన్స్ప్లాంటేషన్." అంటారు చూడు. గది. క్యా కరా మాలూం. మొత్తం పై నెత్తి కోసిండు. గట్లానే దాని ఎనక్కి తిప్పి ఒక్కొక్క వెంట్రుకా పీకిండు భై. పీకి మల్లీ గది నెత్తిన పెట్టి, కుట్లేసి "కల్ ఆజా" అన్నాడు. మర్నాడు మల్లీ ఎళ్ళినం. ఏం చేసిండో తెలుసా. కుట్లు ఊడ దీసి గా బొక్కల్లొ ఒక్కొక్క ఎంట్రుకా దూర్చిండు భై. ఎంత ఒత్తుగా వచ్చిందో తెలుసా కొత్త జుట్టు. పరేషాన్ భై. మత్తు మందు భీ ఇయ్యలె. ఒక్క బొట్టు రగతం కారలె. నొప్పి కూడా తెలీలేదన్నాడు భై, నా దోస్త్.
సె.ఓ.: అంతా ఝూట్ ర! నమ్ముకుండ్రి. నాకు తెలుసు. రెండు రోజులు ఆపరేషను ఎవడు చేస్తాడు భై.
ఈ రకంగా వాదులాట కాసేపు జరిగాక బడాయి వ్యక్తి కొంచెం తగ్గాడు. "రెండు రోజులు కాదులే. కానీ మిగిలిందంతా నిజం" ఇంకా ఎవరూ ఆ విషయం మీద ఎక్కువ చెప్ప దలుచుకో లేదు.
(ఇది నిజంగా జరిగింది. ఇలాటి వాళ్ళు కూడా ఉంటారని అరవై పైబడి బతికిన నాకు అప్పుడే తెలిసింది.)
################################
No comments:
Post a Comment