బ్లాగులో తెలుగు బాగుగా వెలుగు

తెలుగు భాష వెలుగులు జిలుగుల బ్లాగులో

Friday, April 22, 2016



భాషంకరాలు అనబడే భాషా సంకరాలు (ఉట్టినె హాస్యానికి, మన భూమి భరత భూమి, మనమంతా భారతీయులం ) 

##########################


భాషా సంకరం మీద భాగ్యనగర వాసి, ఒక ఉర్దూ కవి (సాయెబు గారు) ఇలా వ్రాశారు. మొదటి పల్లవి గుర్తుంది.

నక్కో, నక్కో బోలేతో భీ సచ్చి పోయిండ్రో బాబూ మియా" 

నేను కొంచెం కలుపుతున్నాను. 

బీబీ బచ్చోన్ యహా చోడ్కే సచ్చి పోయిండ్రో బాబూ మియా 

ఊపర్ జాకె జల్దీ హి దయ్యమయ్యిండ్రో  బాబూ మియా 

నీచే ఆకే పేడ్ పే కాపరం పెట్టిండ్రో బాబూ మియా

బీబీ బచ్చోంకి కష్టాలను చూసిండ్రో బాబూ మియా

అచ్చా హూ మై మర్ గయా అనుకుండ్రో బాబూ మియా 

నహి మరేతో ఏ పరేషాన్ సే సచ్చిపోతుంటి అనుకుంటూ

ఉడ్కే ఎగిరి పోయిండ్రో బాబూ మియా!    

(ఈ జోకు ముళ్ళపూడి వారిది) కవిత నాదే నండోయ్! 


భాషా సంకరమనేది సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ. రెండు భాషలు కాని, ఒకే భాషలో వేర్వేరు మాండలికాలు కానీ మాట్లాడే వాళ్ళు ఒకటే చోట ఉన్నప్పుడు వారి భాష లేద మాండలికం లోని పదాలు వేరే వారి భాష లోకి చొప్పడడం సహజమే! ఈ "సంకర" ప్రక్రియ భాషా పరంగా సాధు పుంగవులమనుకొనే వారికి (భాషా మడి కట్టుకొనే వారికి) యెగతాళిగా ఉండొచ్చు కానీ నా బోంట్లకు ఇది సహజ సిద్ధమైన పరిణామంగానే తోస్తుంది. కానీ అప్పుడప్పుడు ఈ సంకరమైన భాష విన్నప్పుడు పెదాల అంచుల్లో చిరు నవ్వు రావడం సహజం.ఇది ఒక రకంగా గురజాడ అప్పారావు గారికీ నాటి గ్రాంధిక వాదులకీ మధ్య జరిగిన "వ్యావహారిక మరియు గ్రాంధిక భాషా" చర్చ వంటిదే. ఈ మధ్య కాలంలో విశ్వనాధ వారు, శ్రీ శ్రీ గారూ కవిత్వమంటే ఛందస్సా,, లేదా ప్రజల కర్ధమయ్యే వచన కవిత్వమా అనె "తంతు" లాంటిది.  


 అలాగే  కొన్ని భాషల లోని పదాలు మన భాషలోకి చేరిపోయి "శివరాత్రి కొచ్చి సంక్రాంతి వరకు" తిష్ట వేసే దశమ గ్రహాల్లాగా ఉండి పోతాయి. ఉదాహరణకి "కోషిష్" (कोशिश ), పరేషాన్ (परेशान ), సుస్తీ (सुस्ती) వంటి పర భాషా పదాలు తెలుగులో తిష్ట వెశాయి, ప్రధానంగా భాగ్య నగరంలో. ఈ రకమైన భాష దశాబ్దాల క్రితం  చాలా సహజంగా విన వచ్చేది. మేమొక బస్సెక్కే వాళ్ళం రోజూ. ఆ కండక్టరుకి ఊత పదం " परेशान "  "మ్మ! ఏడ జనం భాయ్! ఒకటే పరేషాన్ చేస్తుండ్రు. టికట్, టికట్ అందరూ టికట్ కొట్టించుకోండి భయ్యా! ముందుగాల చెకింగ్ ఉంది. మ్మ! ఆడి సేతుల్లొ పడ్డమంటే మళ్ళీ परेशान   అరె. దోవ. దోవ కడ్డం లెండి భయ్యా! అడ్డంగా  నిలబడతారు! పరేషాన్ చేస్తరు. "ఇలా సాగేది ప్రయాణం. మా స్నేహితుడొకడు చూసి, చూసి "ఏంది భాయ్! परेशान , परेशान అంటూ బస్సెక్కిన కాడ్నించి परेशान  చేస్తనే ఉంటావు" అని చురకేశాడు. బస్సులో అందరూ పెద్దగా నవ్వారు, కండక్టరుతో సహా.  అప్పుడు మాకు ఇరవై యేళ్ళు. అదో సరదా ఆ రోజుల్లో.   

ఇంకా గొప్ప విషయమేమిటంటే రెండు భాషల్నీ కలిపి ధారాళంగా మాట్లాడ గలగడం. ఇక్కడ పదాలు కాదు వాక్యాలే గంగా ప్రవాహంలా ఒక దాని తరువాత ఒకటి దొర్లేవి.   

ఇది చూడండి. ఒక కుర్రోడు ఇంకో కుర్రాడికి తన స్నేహితుడి ప్రేమ భగ్న మైన విషయం చెప్తున్నాడు బస్సులోపల కూర్చుని. ఇలా సాగింది వాక్ప్రవాహం.  

"అరె! మై బొల్ రహా హుంభై! ఈ పిల్ల నీకు కరెక్టు కాదు, వో బద్మాష్ హై బోలా! మనోడు ఇంటెనా? ఇస్కె పీచే హి చల్తే రహా! ఇప్పుడేమైంది భై! వో ఇస్కొ చోడ్కే నర్సిమ్మా తో తిరుగుతాంది. గదే భై! నరిమ్మ మాలూం నై! గదేరా! మన సైదులు కొడుకు! అబ్బో! బహుత్ పైసా వాలా భై! వానిల్లు చూడాల, ఇంద్ర భవనమే అనుకో!"ఇలా ఎంత సేపైనా మాట్లాడి ఉంటాడు. అవతలి వాడు ఒక్క ముక్క మాట్లాడితే వొట్టు1 
                              

                                         ############################### 


ఇంకో వింత ఎప్పుడైనా చూశారో, లేదో! ఒక భాషలో పదం ఒక ప్రాంతంలో ఒక అర్ధంతో వాడితే, అదే భాష మాట్లాడే ఇంకో ప్రాంతంలో ఆ పదమే విని ఉండరు. 

నేనో సారి (దశాబ్దాల క్రితం) ఢిల్లీ స్టేషన్లో దిగి బయటికి వస్తుంటే ఆటోల వాళ్ళు, టాక్సీల వాళ్ళు వెంట పడ్డారు "కహా జానా?"  అంటూ.  నేను మన హైదారాబాదు  స్టైల్లో "నక్కో. నక్కో" అంటూ ముందుకి వెళ్తూ ఉన్నాను. అందరూ ఆగి పోయారు కానీ ఒక సర్దార్ జీ నా వెనకే రావడం చూసి "నక్కో బొలాన" అని నా భాగ్యనగర మాండలికంలో కొంచెం కోపం ప్రదర్శించాను.  అతను స్వఛ్ఛమైన హిందీలో, "అది కాదు సాబ్! మీరు నక్కో, నక్కో అంటున్నారు కదా. దాని అర్ధం తెలుసుకుందామని వస్తున్నాను" అన్నాడు. సమస్య ఏమిటంటే మళ్ళీ అతని కర్ధమైన హిందీలో "నక్కో" అర్ధం చెప్పడం నాకు రాదు. పక్కన ఒక ఆటో డ్రైవరు "నక్కో బొలేతో నహి చాహియే. ఓ హైదరాబాదీ భాషా హై" అని పెద్దగా నవ్వాడు. అదండీ కధ.      

నేను ముంబాయికి వెళ్ళిన కొత్తల్లో నా హిందీ మాండలికం భాగ్యనగరందే ఉండేది. మన భాగ్యనగరంలో "లోగ్" (ప్రజలు) అనె పదాన్ని లొగా (గా అనేది ముక్కుతో పలకాలి) అని వాడతారు. నాకూ ఇలాటి హిందీనే వచ్చేది. ఒక రోజు మా సుపుత్రుడు "డాడీ! మీరు హిందీని ఖూనీ చేస్తున్నారు, ఆ హిందీతో ఎదుటి వాళ్ళను ఖూనీ చేస్తున్నారు" అని చెప్పాడు. (వాడికి ఏ భాషైనా సరిగ్గా మాట్లాడితే కానీ నచ్చదు. నా యింగ్లీషుని రోజుకి యాభై సార్లు దిద్దుతుండే వాడు.  గర్వ కారణమే కదా?)    

మీరెప్పుడైన హైదరబాదీ "ఇచ్" విన్నారా. "దురద" కాదండోయ్! లాంటిది. నేనో సారి ఎస్ ఆర్ నగర్ బస్ స్టాపులో బస్ కోసం నిలబడి ఉన్నా. అక్కడ దూర ప్రాంత బస్సుల రిజర్వేషన్ కౌంటర్ ఉంది. అందులో నుంచి ఒక యువతి బయటికి వచ్చి ఫోను చేసింది. బహుశా భర్తకయి ఉండ వచ్చు. అవతలి వాళ్ళు మాట్లాడింది మనకు వినపడదు కదా? ఊహిద్దాం. సంభాషణ ఇలా సాగింది.  

"బయటికి వచ్చావా?" 

"అభీచి."

"రెజర్వేషన్ అయ్యిందా?" 

"అభీచి" 

"వొల్వో బస్సేనా" 

"వొల్వోఇచి" 

"ఏ సీ  ఏనా"

"ఏ సీ ఇచి" (వోల్వోలన్నీ ఏ సీ ఇచి ఉంటాయేమో కదా? నాకు తెలీదు) 

"ఎస్ ఆర్ నగరు లోనేనా?" 

"ఎస్ ఆర్ నగర్ చి" 

సరే ఈలోగా నా బస్సిచ్చింది, సారీ బస్సొచ్చింది. తరువాత ఎన్ని ఇచ్ లొచ్చాయో నాకు తెలీదు. "ప్చ్"       


ఇప్పుడు ఒకటే పదం రెండు భాషల్లో ఉందనుకోండి. ఉదాహరణకి గాటు అని తెలుగులో ఒక పదం ఉంది. హిందీలో ఘాట్ అనే పదం ఉంది. ఇందులో ఎలా హాస్యం పుట్టిందో చూడండి.  

వారణాశిలో ఇద్దరు గోదావరి జిల్లా వాళ్ళు ఘాట్లో స్నానం చేసి వారణాశి అందాల్ని ఆస్వాదిస్తున్నారుట. అందులో ఒకడు ఉనట్టుండి "అబ్బో ఎన్ని గాట్లో" అన్నాట్ట. పరధ్యానంగా ఉన్న రెండో వాడు "ఎక్కడ, ఎక్కడ " అంటూ మొదటి వాడి వొళ్ళు తడిమి చూస్తున్నాట్ట. మొదటి వాడు వాణ్ణి విసిరి కొట్టి, "యెహె! తెలుగు గాట్లు కాదు, హిందీ గాట్లు" అన్నాట్ట.  ఇది కూడా నిజంగానే జరిగిందండీ.     

అసలు ఈ బ్లాగు వ్రాయాలని యెందుకనిపించిందంటే తెలుగు వాళ్ళు బెంగాలీ మాండలికంలో మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అని రాత్రి నిద్ర పట్టని సమయంలో ఆలోచన వచ్చింది.  (వయసు పెరిగిన కొద్దీ నిద్ర తగ్గుతుంది) బెంగాలీ వాళ్ళు "వ" ని "బ" అంటారు. అలాగే ఎక్కువగా "ఓ" అనే అచ్చుని ఎక్కువ వాడతారు. ఉదాహరణకి "పోరిబొర్తన్" మనం చక్కగా పరివర్తన్ అంటాం కదా. కాకి భాష కాకికి ముద్దు.  (అందుకే "చక్కగా" పద ప్రయోగం చేశాను).

ఇద్దరు తెంగాలి (బెంగాలీ మాండలికంలో తెలుగు మాట్లాడే వాళ్ళూ) వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు. ఒకడు ఇంకొకడికి వంద, అదేనండీ వొంద రూపాయలు అప్పిచ్చాడు. అతను తిరిగి ఇస్తూ 

"ఇదుగోనండీ మీ బొంద రూపాయలు."   

"నా బొంద నాకిచ్చారు సరే! బొడ్డీ సంగతేంటీ"  

"బెధవ మీ బొంద రూపాయలకి, అదీ బోరం రోజులు కాలేదు బొడ్దీ ఏమిటండీ" 

ఈ లోగా మూడో వాడొచ్చాడు "ఏమిటండీ. బోదించుంటున్నారు?" 

ఇలా సాగుతుందండీ.       

కన్నడ భాష తెలుగు భాష చాలా దగ్గరగా ఉంటాయండీ. నేను కన్నడ దేశంలో పని చేసేప్పుడు నా భార్యని మొదటి సారి బెంగళూరు తీసుకు వెళ్ళాను. అక్కడ మెజస్టిక్ బస్ స్టాండు దగ్గర రిక్షాలో వెళ్తున్నాం. నా భార్య పగలబడి నవ్వడం మొదలు పెట్టింది. విశేషమెమిటని చూస్తే అక్కడ ఒక బోర్డు ఉంది. "ಕನ್ನಡದ ಕಂಪು " అని. కంపు అంటే తెలుగులో దుర్వాసన అని అర్ధం కదా. కన్నడంలో సువాసన అని అర్ధం. నాకు కన్నడ భాష మీద బాగా పట్టు వచ్చింది కాబట్టీ ఆమెకి చెప్పాను. చూశారా భాషల్లో పదనిసలు.     
తెలుగులో పాలు కన్నడాలో ಹಾಲು (హాలు), పాము  (ಹಾವು  ) పువ్వు (ಹುವ್ವು ) ఇలా ఉంటుందండీ. దీని మీద కూడా మా క్లర్కు ఒకడు (తెలుగు వాడు) గొప్ప హాస్యాన్ని సృష్టించే వాడు.  బాగుండదు లెండి.    

అలాగే లిపిలో కూడా మనము ్ వాడే చోట వాళ్ళు ఓత్వం వాడతారు.  రాజ కుమార్ ని  "ರಾಜಕುಮಾರ್ " అని వ్రాస్తారు. 

ఒక సారి ఒక కన్నడ సినిమా పోస్టరు కనిపించింది.

ರಾಜಕುಮಾರ್ ನಟಿಸುವೋ ದೆವಿಶ್ರೀ 

ಎಂಟಪ್ರಿಶೆಸ್  ಸಂಪತ್ತಿಗೆ ಸವಾಲೋ

ఇది చూసి మా స్నేహితుడొకడు ఇలా చదివాడు. "రాజ కుమారో నటిసువో దేవిశ్రీ ఎంటర్ ప్రైజెసో సంపత్తిగో సవాలో" అని.

ఇంకో ప్రబుద్ధుడు వెంటనే "చూడాలో వద్దో" అని జోకేశాడు. మాదంతా విదూషకుల  గుంపు లెండి. చిన్న వయసు పెద్ద ఉద్యోగాలూ, జీతాలూనూ!   

తెలుగు భాషలో "ప్రమాదము" అంటే ప్రమాదమే. తమిళంలో అదే పదానికి "బ్రహ్మాండం" అనిట. మా వదిన మద్రాసు వెళ్ళిన కొత్తలో వాళ్ళ ఇంటి  ఓనరు కాలు జారి పడితే మా వదినకి తమిళ భాష రాదు కాబట్టి తెలుగులో "అయ్యో! ఎంత ప్రమాద్దం జరిగింది" అన్నదట.  అంతే ఆమె ఆరున్నొక్క రాగం ఎత్తుకుందిట తమిళంలో. ఆమెకి తెలుగు రాదు, ఈమెకి తమిళం రాదు. చివరికి మా అన్నయ్య వచ్చాక  రెండు భాషల్లో దాని అర్ధం వివరించి శాంత పరిచాడట.  

ఇవండీ నాకు గుర్తున్న కొన్ని భాషంకరాలు.  ఆరు దశాబ్దాల  పయనంలో ఇంకెన్నో ఉండి ఉంటాయి. వచ్చే బ్లాగులో ఇంకొన్ని.



No comments:

Post a Comment