భాషంకరాలు అనబడే భాషా సంకరాలు (ఉట్టినె హాస్యానికి, మన భూమి భరత భూమి, మనమంతా భారతీయులం )
రెండవ భాగము
అంజయ్య గారూ-తేలూ కధ
అంజయ్య గారని మన ముఖ్య మంత్రి గారు భాషా మాండలికాన్ని ఒక స్థాయికి తీసుకు వెళ్ళి కడుపుబ్బ నవ్వే హాస్యాన్ని సృష్టించారు. ఆ రోజుల్లో అంజయ్య గారంటే నాకు చాలా అభిమానముండేది. ఆయన గొప్ప ముఖ్య మంత్రి అని కాదు. ఒక కార్మికుడిగా ఉన్న వ్యక్తి తను నమ్మిన పార్టీకి ఎప్పుడూ నిబద్ధతో పని చేస్తూ ముఖ్య మంత్రి కాగలిగారు అది నాకు నచ్చింది.
ఈయన గారు ఒక సారి గోదావరి జిల్లా వెళ్ళారుటండీ. జిల్లాలో కరువుందో ఏమిటో నాకు గుర్తు లేదు. ఉపన్యాసం చెబుతూ, "గోదాట్లో తేలు పడింది. ఫికరు చెయ్యకుండ్రి" అన్నారుటండీ. "అయ్య బాబోయ్! గోదారి తల్లిని తేలు కుడితే ఎట్లా?" అని అక్కడున్న అయ్యలు, అమ్మలక్కలూ ఓటే ఇదై పొయ్యారండీ. ఇంతకీ విశేషమేమిటంటే అప్పుడే గోదావరి బేసిన్లో చమురు నిక్షేపాలున్నాయని తెలిసింది. హిందీలో तेल అంటే చమురు అని అర్ధం కదండీ, అదీ కధ. तेल కాస్తా తేలు అయ్యింది.
దొబ్బుకొచ్చిన కధ
తెలుగు రాష్ట్రంలో మూడు ప్రాంతాలకి మూడు విభిన్న మాండలికాలుంటాయి. ఇది కాక ప్రతి జిల్లాకి ప్రత్యేకమైన మాండలికం ఉంటుంది. తమాషా ఏమిటంటే ఒక ప్రాంతంలో వాడే ఒక పదం ఒప్పు అయితే అదే పదం ఇంకో ప్రాంతంలో తప్పు అవుతుంది. అలాంటిదే ఈ "దొబ్బుకొచ్చిన" కధ.
ఓ సారి మా బిల్డింగు వాచ్ మన్ మా ప్రక్క ఉండే ఒక తెలంగాణా ప్రాంత వాసులైన వారింటికి వచ్చి తలుపు కొట్టాడు. అతను రాయల సీమ వాసి. సంభాషణ ఇలా సాగింది.
ఆ ఇంట్లో ఓ పెద్ద ముత్తైదువు తలుపు తీసింది.
వాచ్ మన్ (వా.మ) : "ఏందమ్మా! కింద పిల్లగాని దగ్గర ఇప్పుడే ఇత్తానని పెన్సిలు దొబ్బుకొచ్చినావంట కదా. ఆళ్ళడుగుతున్నారు. పిల్లగాడు హోం వర్కు చేసుకోవాలంట."
తెలంగాణా పెద్ద ముత్తైదువు (తె.పె.ము): ఏందేందీ! మళ్ళ చెప్పు.
వా.మ.: అదేనమ్మా! కింద 103 నంబరాళ్ళ పిల్లగాని కాడ పెన్సిలు దొబ్బుకొచ్చినావంట కదా!
తె.పె.ము.: ఏందీ? దొబ్బుకొచ్చినానా? దొబ్బుకు రావడానికి మేమేమన్న చోర్ల లెక్క కనబడతన్నమా? పంచేసేటోడివి పంచేసేటట్టుండాల. గిట్ల చేస్తే మేమసలే ఖతర్నాక్ గాళ్ళం. సమఝ్ అయ్యిందా?
ఇలా తిట్ల పురాణమందుకుంది. ఈలోగా, పక్కనున్న ఆంధ్రా పెద్ద ముత్తైదువు (ఆం.పె.ము.) బయటికొచ్చింది. మామూలుగా తన భారీ కాయాన్ని సగం బయట, సగం లోపల ఉంచి కూర్చుంటుంది. ఇలాంటి సందర్భాలు రాక పోతాయా అన్నట్టుగా. ఆమె జరిగిందేమిటో తెలుసుకుని సంభాషణలో తన మాండలికంలో ఈ విధంగా పాలు పంచుకుంది.
ఆం.పె.ము.: (గుంటూరు జిల్లా) అది కాదబ్బాయా. పెద్దంతరం, చిన్నంతరం ఉండాలా వద్దా? దొబ్బుకు రావడానికి ఆమెకేం ఖర్మ. అంతగా కావాలంటే అడుక్కుంటది . క్షమాపణడుగు. "అడుక్కుంటది" అనే పదం వత్తి పలుకుతూ.
వా.మ. (మొండోడు): నేనెందుకు సారీ చెప్పాలమ్మా. నేనేమన్నాను. దొబ్బుకొచ్చింది అనాళ్ళు చెబితే, దొబ్బుకొచ్చినావా అనడిగాను. తప్పేంది.
ఈ గోల విని అతని భార్య పైకొచ్చింది. ఆ పిల్ల నాలుగిళ్ళల్లో పని చేస్తుంది కాబట్టి లౌక్యం తెలుసు. "అదేం లేదమ్మా? మా కాడ దొబ్బుకొచ్చినాడు అంటే తీసుకొచ్చినాడు అని అర్ధం. మీకు అది తప్పు మాటని మా మామకి ఎరిక లేదు" అని చెప్పి, "రా! మామా! నీ తప్పేం లేదులే.' అని రెక్క పట్టుకుని ఈడ్చుకెళ్ళింది. పేద వాళ్ళ ప్రేమలే వేరు. మొగుడి మీద ఈగ వాలనివ్వరు. ముచ్చటేస్తుంది చూస్తుంటే.
"సక్కా పో" కధ
మేము జీవిత భీమా సంస్థలో పని చేసేప్పుడు నలుగురు స్నేహితులం కలిసి వెళుతూ దారి తప్పాం భాగ్యనగర వీధుల్లో. దారిన పోతున్న దానయ్యని పిలిచి మా స్నేహితుడు "మెయిను రోడ్డుకి ఎలా వెళ్ళాలయ్యా?" అనడిగాడు. అతను "సక్కగా పో" అన్నాడు. మా వాడికి మండింది. (నల్లగా ఉండేవాడు) "నేను చక్కగానే పోతాలేవయ్యా. నువ్వు దారి చెప్పు" అని గదిమాడు. దానయ్యకి కోపమొచ్చింది. "గదేనయ్యా సెప్తూంది. సక్కా పొమ్మన్నను కదా" అని చెప్పి అతను సక్కా పోయాడు. తరువాత తెలిసింది. "సక్కా పో" అంటే "సీధా జావో" అని. మరి మా జిల్లాల్లో "సక్కగా" అంటే "అందంగా" అని కదండీ. ఒక అందమైన అపార్ధం.
మేము 11వ తరగతి(ఎస్ ఎస్ ఎల్ సీ) చదివే రోజుల్లో హిందీ భాష కేవలం ఒక ఆభరణంగానే ఉండేది. కానీ త్రిభాషా సూత్రం అమలు కోసం ప్రతీ పాఠశాలలోనూ ఒక హిందీ అధ్యాపకుడుండేవారు. మాకు గురజాడ క్రిష్ణయ్య గారని అధాపకులుండే వారు. అయిదు మార్కులొస్తే గట్టెక్కినట్టే హిందీలో. పైపెచ్చు ఈ మార్కుల్ని మొత్తంలో కలిపే వారు కాదు . "హిందీ పాఠం ఎవడు వింటాడ్రా అని కాలక్షేపం చేస్తుండే వారు." వీరు భాషా సంకరం ఈ విధంగా చేసి హాస్యాన్ని సృష్టించారు. "ఏక్, దో, తీన్, చార్, పాంచ్ భజనా, గురజాడ క్రిష్ణయ్య గుండు భజనా" అని పాడి అందరి చేత పాడించి తాళం వేస్తూ ఉండే వారు.
చివరగా ముళ్ళపూడి వారి ఓ చక్కటి జోకు.
ఓ అప్పారావు ఓ వైద్యుడి (అప్పిచ్చువాడు వైద్యుడు అన్నారు కదండీ) దగ్గర అప్పు తీసుకొని రేండేళ్ళ తరువాత తారస పడ్డాడుట. అప్పు సంగతి కదిలిస్తే "పెద్దాపురంలో డబ్బొచ్చేదుంది. పెద్దాపురం వెళ్ళి రాగానే ఇస్తానన్నాడుట. ఆర్నెల్ల తరువాత దర్సనమిచ్చిన అప్పారావుని వైద్యుడు "ఏమయ్యా! పెద్దాపురం వెళ్ళి రాగానే డబ్బిస్తానన్నావ్. ఏదీ డబ్బు?" అని అడిగాట్టండీ.
తొణుకూ, బెణుకూ లేకుండా అప్పా రావు "ఏదీ ఇంకా పెద్దాపురం వెళ్ళందే." అని చెప్పి సక్కా పోయాట్ట.
#########################################